పులివెందుల, సెప్టెంబర్ 30:
రాయలసీమను వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో మరింత అభివృద్ధి చేసి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని టీడీపీ నేత బీటెక్ రవి తెలిపారు. ‘రైజింగ్ రాయలసీమ’లో భాగంగా హార్టికల్చర్ హబ్ విధానాన్ని అక్టోబర్ 2న మదనపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర గ్రాంట్లు, ఇతర నిధులను సమీకరించి సుమారు రూ.లక్ష కోట్లతో రాయలసీమలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు పండ్ల తోటలను పెద్దఎత్తున విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా పులివెందులలో రైతులు సుమారు 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.
జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల నియోజకవర్గంలోని 299 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని బీటెక్ రవి పేర్కొన్నారు. పైడిపాలెం, గండికోట ప్రాజెక్టుల ద్వారా చిత్రావతి ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు.
లింగాల మండలంతో పాటు ఇతర ప్రాంతాల్లో అరటి తోటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి చెరువులను నింపే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి గతంలో అనుకూల ఫలితాలు లేకపోయినా, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా తాగునీరు, సాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటోందని అన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే పులివెందుల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని బీటెక్ రవి ప్రజలను కోరారు.



