రాయచోటి: మానవత సంస్థ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా రాయచోటిలో బుధవారం ఘనంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా బంగ్లా సర్కిల్ వరకు సాగింది. అక్కడ మానవహారం నిర్వహించి ప్రజలకు శాంతి, సేవా భావంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, సంస్థ సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
మానవత సంస్థ సేవా కార్యక్రమాలకు మద్దతుగా కదిరి రంగా రెడ్డి, వెంకట్రమణమ్మ దంపతుల కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. నిరుపేద విద్యార్థుల విద్యకు భవిష్యత్తులోనూ సహకరిస్తామని దాతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు.



