ప్రొద్దుటూరు: ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్. తులసిరెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదని, సుమారు రూ.8 వేల కోట్లకు పైగా నిధులు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
కాంగ్రెస్ నాయకుడు నజీర్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధిని పక్కనపెట్టి గత కొన్ని వారాలుగా రాజకీయ విమర్శలు, ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్లాస్టిక్ తయారీ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



