ప్రొద్దుటూరు: పరీక్షలో ప్రశ్నకు సమాధానం రాయలేదన్న కారణంతో ఆరవ తరగతి విద్యార్థిపై ప్రైవేట్ టీచర్ చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పట్టణంలోని సంగమేశ్వర ప్రైవేట్ హైస్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న తమన్ అనే విద్యార్థిపై టీచర్ దాడి చేసినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపించారు.
పరీక్ష సమయంలో జవాబు రాయలేదన్న కారణంతో టీచర్ విద్యార్థిని చితకబాదినట్లు వారు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని వివరణ కోరగా, తమ ఫిర్యాదుపై సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించారు.
దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులపై జరుగుతున్న ఇటువంటి ఘటనలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.



