పులివెందుల, సెప్టెంబర్ 21: పులివెందుల పట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నూలు పూజ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారికి ఆలయ అర్చకులు కృష్ణరాజేశ శర్మ, రాజసింహ శర్మ, నాగపణి శర్మల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అశ్వ వాహనంపై కొలువుదీర్చి ఆలయ పరిసరాల్లో భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి వాహన సేవను భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించి ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కొట్టే వెంకటరమణ, అంగడి నాగేంద్ర కుటుంబ సభ్యులు, రిటైర్డ్ వార్డెన్ ఆంజనేయులు, విద్యాశాఖ అధికారి గోపాల్, శ్రీరంగనాథ ట్రస్ట్ సీఈఓ అల్లం రంగనాయకులు, ఆలయ అధికారులు పురుషోత్తం, విజయ్, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.



