వేంపల్లి, సెప్టెంబర్ 2:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. ఉదయం జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సతీమణి భారతి వెంట రాగా ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తండ్రి సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి వైసీపీ నాయకులు, అభిమానులను పలకరించారు.
జగన్ అనంతరం షర్మిల తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తండ్రి సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఇరువురు నేతలు ఘాట్‌కు రావడంతో వైసీపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రం సందడిగా మారింది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మాధవరావు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ బాష, శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి, తొపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రాజోలు వీరారెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, పులివెందుల ఇన్చార్జ్ ధృవకుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా, గౌస్ పీర్, రామకృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



