ప్రొద్దుటూరు: విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి, జిజ్ఞాస, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలిపారు. ఆదివారం నందిని క్లాత్ మార్కెట్లోని జేవీవీ కార్యాలయంలో డా. డి. నరసింహారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించి చెకుముకి గోడపత్రాలను ఆవిష్కరించారు.
పాఠశాల స్థాయి పరీక్షలు ఆగస్టు 27న, మండల స్థాయి పరీక్షలు సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ, 6–7, 8–10 తరగతులకు మూడు విభాగాల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని డా. నరసింహారెడ్డి సూచించారు. అన్ని పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో జేవీవీ ప్రధాన కార్యదర్శి ఎన్. రాజేష్, కన్వీనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.



