ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 2:
రైతుల భూమి హక్కులకు పూర్తి భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. చౌడూరు గ్రామంలోని స్వర్ణ గ్రామం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్‌పుస్తకాలను అందజేశారు.
చౌడూరు గ్రామంలో మొత్తం 923 మంది పట్టాదారులు ఉండగా, రీ-సర్వే పూర్తయిన 876 మంది రైతులకు తొలి విడతగా పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాస్‌పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫొటోలకు బదులుగా ప్రభుత్వ రాజముద్రతోనే పత్రాలను అందిస్తున్నామని, రైతుల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. చౌడూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్, ఆర్ఐ నాగమోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఇన్చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్, టీడీపీ నాయకులు రవికుమార్ రెడ్డి, శంకరాపురం మారుతి ప్రసాద్ రెడ్డి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



