రాయచోటి : రక్తదానం మహాదానం అని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని ప్రముఖ సంఘసేవకులు, హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ తెలుగు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ అన్నారు. వేసవి కాలంలో రక్త కొరత తీవ్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమియా అనే గర్భిణి రక్తహీనతతో బాధపడుతూ అత్యవసరంగా బి-పాజిటివ్ (B+) రక్తం అవసరమైంది. రక్తనిధి కేంద్రాల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో అర్ఫాత్ అనే యువకుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా అర్ఫాత్ సేవాభావాన్ని డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని, శరీరం బలహీనపడుతుందనే అపోహలు సమాజంలో ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. వాస్తవానికి రక్తదానం చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కొలెస్ట్రాల్, కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పలు వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన అర్ఫాత్ను డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ అభినందించి, సేవా స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘసేవకులు డాక్టర్ సయ్యద్ అహమ్మద్, సమీర్, ఖాళీద్, షారుఖ్, ఆల్ అబూ మరియు రక్తనిధి కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.



