యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం కడప నగరంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా పేరుతో ప్రజలను యూపీఐ వినియోగానికి ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే సేవపై చార్జీలు విధించాలని భావించడం ప్రజా విశ్వాసానికి విరుద్ధమని విమర్శించారు.
యూపీఐ సేవలను ఉచితంగా కొనసాగించడంతో పాటు, డిజిటల్ చెల్లింపులపై అదనపు భారం మోపే నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవలపై వివిధ రూపాల్లో ప్రజలపై అనేక చార్జీలు విధిస్తున్నారని, యూపీఐపై కూడా రుసుములు విధిస్తే సామాన్యులు, చిన్న వ్యాపారులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



