ప్రొద్దుటూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మౌనహారం, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ పట్టణ కార్యదర్శి కుందవరం సాల్మన్, కోశాధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ 12వ పీఆర్సీ, వేతనాల పెంపు, డీఏ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అమలు చేయాలని కోరారు. ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు పూర్తయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం, రిటైర్మెంట్ బెనిఫిట్లు, పింఛన్ కల్పించాలని కోరారు. కోవిడ్ కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని, రూ.18,500 వేతనం, సమ్మె కాలపు జీతాలు, జూలై నెల జీతాలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు నాణ్యమైన పనిముట్లు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.



