ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 30: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ప్రొద్దుటూరులో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పలు డిమాండ్లను ప్రభుత్వం, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, మున్సిపాలిటీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, మృతిచెందిన, 60 ఏళ్లు పూర్తిచేసుకున్న కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
కోవిడ్ కార్మికులకు కనీస వేతనం రూ.18,500 చెల్లించి ఆప్కాస్‌లో చేర్చాలని, 12వ పీఆర్సీ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన కార్మికులకు రూ.2 లక్షల బీమా సొమ్ము అందించాలని, పనిముట్లు, యూనిఫాం, ఇతర పారిశుధ్య పరికరాలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు సాల్మన్, రాఘవేంద్ర, విజయకుమార్, రవికుమార్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.



