వేముల, అక్టోబర్ 16: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై పుంగనూరులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కడప జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం కార్యనిర్వాహక సభ్యుడు చల్లా సునీల్ కుమార్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదని, ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఎంపీపై దాడి జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని సునీల్ కుమార్ అన్నారు.



