ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 9: శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రాతఃకాలం నుంచే స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు విశేష గోపూజ, గణపతి, నవగ్రహ, ఉపగ్రహ, ఉపదేవతలతో పాటు రుద్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల ఆర్జిత కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈఓ కే.వీ. రమణ, చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాముల బృందం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించింది. మాస శివరాత్రి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.



