ప్రొద్దుటూరు, ఆగస్టు 28: స్థానిక వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణే టీడీపీ లక్ష్యమని, ప్రొద్దుటూరులో కొత్త షాపింగ్ మాల్స్ ఏర్పాటును తాను వ్యతిరేకిస్తున్నానని టీడీపీ మాజీ ఇన్చార్జ్ డాక్టర్ జి.వి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎంఆర్ మాల్, డీమార్ట్, రిలయన్స్ మార్ట్ వంటి సంస్థలకు గతంలో ఎవరి హయాంలో అనుమతులు ఇచ్చారో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రస్తుతం వ్యాపారుల సమస్యలను రాజకీయంగా ప్రస్తావించడం సరికాదని విమర్శించారు. భవిష్యత్తులో కొత్త మాల్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగితే వాటిని అడ్డుకునేందుకు తన వంతు కృషి చేస్తానని, స్థానిక వ్యాపారులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.



