పులివెందుల, సెప్టెంబరు 24: మరణానంతరం కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేలా భూమిరెడ్డి ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన ఈశ్వరమ్మ (90) బుధవారం రాత్రి వయోభారంతో మృతి చెందారు. ఆమె కుమారుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. దీంతో స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం ప్రతినిధులు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి తరలించారు. ఈ కార్నియాల ద్వారా ఇద్దరు అంధులకు చూపు కల్పించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. నేత్రదానంపై ప్రజలు అపోహలు వీడి ముందుకు రావాలని సేవాసమితి అధ్యక్షుడు మొమ్మెల రాజు కోరారు. నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులకు సేవాసమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
Was this article useful?



