పులివెందుల: మత్తు రహిత, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శేష మహేశ్వరమ్మ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు సామాజిక బాధ్యతను అలవరుచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అబ్కారి శాఖ సీఐ చెన్నారెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల దుష్పరిణామాలపై గ్రామాలు, విద్యాసంస్థలు, కుటుంబాల్లో నిరంతరం అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం విద్యార్థినులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.



