ప్రొద్దుటూరు: పట్టణంలో గంజాయి, మద్యం, బెల్ట్‌షాపులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు. బుధవారం దొరసానిపల్లెలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల ప్రభావంతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, నేర ప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు, పోలీసులు, ప్రజాప్రతినిధులు కలిసి గంజాయి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై అధికారులకు సమాచారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రాచమల్లు హెచ్చరించారు.



