కడప: నగరంలోని రామరాజుపల్లె పరిధిలో ఉన్న బుడగజంగం కాలనీ, కృపా కాలనీల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి. మహేష్, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక చిన్నపాటి వర్షానికే వీధులు బురదమయంగా మారుతున్నాయని, మురుగునీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రియాజ్ హాల్ నుంచి కాలనీలకు వచ్చే రహదారితో పాటు ఎస్బీఐ కాలనీ నుంచి కృపా కాలనీ, బుడగజంగం కాలనీలకు వెళ్లే మార్గాల్లో డ్రైనేజీ సదుపాయం లేక వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బురద, మురుగునీటిని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోందని, కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కాలనీలని అభివృద్ధి విషయంలో వివక్ష చూపడం తగదని, నగరంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా మౌలిక వసతులు కల్పించాలని పాస్టర్ పి. మహేష్ కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన అభివృద్ధి హామీలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే కాలనీల్లో పర్యటించి సమస్యలను పరిశీలించాలని, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడగజంగం సంక్షేమ సంఘం నాయకులు డి. శ్రీరాములు, దూపం రాజుతో పాటు కాలనీవాసులు పాల్గొని తమ సమస్యలను వివరించారు.



