పులివెందుల: పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహం నం.2లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు కావడం లేదని AISP కడప జిల్లా అధ్యక్షులు సిదిగే దినేష్ కుమార్ ఆరోపించారు. విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించాల్సి ఉన్నప్పటికీ ఆ విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందని పేర్కొన్నారు.
అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో మాత్రమే మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారనే ఆరోపణలు విద్యార్థుల నుంచి వస్తున్నాయని తెలిపారు. హాస్టల్లో ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, మెనూ అమలు, ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణను పరిశీలించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో ముడిపడిన ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని దినేష్ కుమార్ కోరారు.



