ప్రొద్దుటూరు, సెప్టెంబరు 23: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నూతన నైపుణ్యాలను అలవర్చుకుని ఫోటోగ్రాఫర్లు వృత్తిలో రాణించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచించారు. రామేశ్వరం రోడ్డులోని ఎంఎంటీ ఫంక్షన్ హాల్లో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఫోటోగ్రాఫర్స్ డే వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఏఎస్పీ విభూకృష్ణ, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇళ్లు లేని పేద ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తానన్నారు.
ఫోటోగ్రఫీ ఒక కళ అని ఏఎస్పీ విభూకృష్ణ పేర్కొనగా, సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని కమిషనర్ సూచించారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లు, పారిశుధ్య కార్మికులు, అతిథులను అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.



