ప్రొద్దుటూరు, ఆగస్టు 6: పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు, వ్యాపార వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని వైన్స్ షాపులు, టీ దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. రహదారులు, డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకుపోవడంతో వాటి శుభ్రత కోసం మున్సిపాలిటీ ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.
పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న కమిషనర్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. ప్రజలు, వర్తకులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగస్వాములై ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



