ప్రొద్దుటూరు: జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిపాలన, ప్రజలకు అందుతున్న సేవలు, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు.
మున్సిపల్ కార్యాలయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, అవసరమైన సందర్భాల్లో జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ సూచనలను పాటిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజా సంతృప్తికి అనుగుణంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.



