ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 1: ప్రొద్దుటూరు పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జేసీ డా. నిధిమీనా పాల్గొన్నారు.
పట్టణంలో రహదారులు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సుమారు రూ.600 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, 24 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని ఆదేశించారు. హౌసింగ్ శాఖపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని, అర్హులైన పేదలకు గృహ వసతి కల్పించాలని తెలిపారు.
అలాగే చౌదూరు వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి, గ్రామీణ రహదారులు, తాగునీరు, సాగునీరు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పలు అంశాలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.



