ప్రొద్దుటూరు : వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రొద్దుటూరులోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, సిబ్బంది విధి నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు స్నేహపూర్వకంగా, పారదర్శకంగా పోలీసు సేవలు అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేసినట్లు సమాచారం.



