ప్రొద్దుటూరు: పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు మరో ముందడుగు పడింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కేటాయించిన రూ.296 కోట్ల నిధుల్లో భాగంగా ప్రస్తుతం రూ.40 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో యూఎఫ్ఐడీసీ ద్వారా మరో రూ.252 కోట్లతో డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరులో చేపట్టిన గృహ నిర్మాణాలు, భూసేకరణ అంశాలపై ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వీఎస్ ముక్తియార్, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కొండవీటి భావన, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



