అనంతగిరి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బెంచీలను పంపిణీ చేశారు. అనంతగిరి మండల కోఆర్డినేటర్ నరాజి మల్లేశ్వరరావు చేతుల మీదుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దాసరితోట, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వంతవానిపాలెం పాఠశాలలకు బెంచీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరితోట పాఠశాల హెచ్ఎం జాన్సీ, వంతవానిపాలెం పాఠశాల హెచ్ఎం శ్రీదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు పాల్గొన్నారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని విద్యాభ్యాసం చేసేందుకు అవసరమైన బెంచీలను అందించిన రోటరీ క్లబ్ సభ్యులకు పాఠశాలల హెచ్ఎంలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.



