రైల్వేకోడూరు: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు రాఘవరాజుపురంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తాగునీరు, రహదారులు, పింఛన్లు, రెవెన్యూ, భూ సమస్యలు, విద్యుత్, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు ముక్కా రూపానంద రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పలువురు వినతిపత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని ఆయన పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తోందని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజా దర్బార్ ద్వారా నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



