లింగాల: మండలంలోని మురారి చింతల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి తోటలను జర్మనీ బృందం, ఐజీజీఏఏఆర్ఎల్ (IGGAARL) అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న అరటి తోటలను పరిశీలించి, పంట ఎదుగుదల, దిగుబడి, నాణ్యతను పోల్చి చూశారు.
ప్రకృతి వ్యవసాయ రైతు ఓ. నారాయణరెడ్డి తోటలో అరటి చెట్లు ఏపుగా పెరగడం, అధిక దిగుబడి, నాణ్యమైన కాయలు ఉండటాన్ని బృందం గమనించింది. మల్చింగ్ వల్ల భూమిలో తేమ నిల్వ ఉండటం, వేర్లు దృఢంగా పెరగడం, తక్కువ నీటి లభ్యతలోనూ చెట్లు ఆరోగ్యంగా ఉండటాన్ని పరిశీలించింది. అనంతరం రైతు నారాయణరెడ్డితో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వాటి వల్ల కలిగిన ప్రయోజనాలపై చర్చించింది.
ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని, సిబ్బంది యామినిలత సహకారంతో అంతర పంటలు, బార్డర్ క్రాప్స్ సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నానని తెలిపారు. ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడంతో పాటు వైద్య ఖర్చులు కూడా తగ్గాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో జర్మనీకి చెందిన ఐరిష్, సంగీత అగర్వాల్, ఆర్‌వైఎస్ఎస్ రాష్ట్ర బృందం ప్రతినిధి మురళీధర్, రీసెర్చ్ డైరెక్టర్ వరప్రసాద్, ఐజీజీఏఏఆర్ఎల్ అధికారులు శివారెడ్డి, లలిత, గుల్జర్, జలాల్, అనిత, స్వాతి, రైతు నారాయణరెడ్డి, డీఎంఎంటీ యామినిలత, వైఆర్ఎఫ్ తదితరులు పాల్గొన్నారు.



