పులివెందుల, ఆగస్టు 28: పులివెందుల బ్రాహ్మణపల్లి రోడ్డులోని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానంలో శ్రావణ మాస శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.
పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం సామూహిక కుంకుమార్చన, సాయంత్రం ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం ‘జై చౌడమ్మ తల్లి’ నామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రాజేంద్రప్రసాద్, అర్చకులు ప్రవీణ్ స్వామి, భక్తులు పాల్గొన్నారు.



