ప్రొద్దుటూరు, ఆగస్టు 28: ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నానగర్లో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున విస్తృత తనిఖీలు నిర్వహించారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఉదయం 4.30 నుంచి 7 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
పోలీసు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లను గుర్తించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 28 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, పేకాట, బెట్టింగ్, రౌడీయిజం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఏఎస్పీ విభుకృష్ణ తెలిపారు.
ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ టి.వి. కొండారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



