పులివెందుల, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పులివెందుల టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి, వేంపల్లె టీడీపీ ఇన్చార్జి అజ్జుగుట్టు రఘునాథరెడ్డి, మారెడ్డి రామ్‌రెడ్డి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మారెడ్డి లతారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాల కల్పన, పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా మౌలిక వసతుల బలోపేతం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పంచాయతీలను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
అజ్జుగుట్టు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పవన్ కళ్యాణ్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు భరత్‌రెడ్డి, యువరాజ్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.



