పులివెందుల, ఆగస్టు 27: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.
కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనిత, సేవాసమితి అధ్యక్షులు రాజు ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థినులు ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ప్రజలకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతరం పూల అంగళ్ల కూడలిలో మానవహారం నిర్వహించి నేత్రదాన ప్రతిజ్ఞ చేశారు. ఒకరి నేత్రదానం ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, సేవాసమితి సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.



