పులివెందుల, సెప్టెంబర్ 30: స్థానిక శ్రీరామహాల్ రోడ్డు-2లోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం అంగన్‌వాడీ ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బి. రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై తల్లులకు అంగన్‌వాడీ సేవలు, పౌష్టికాహార పథకాలపై అవగాహన కల్పించారు.
గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, రాగిపిండి, పప్పు, నూనె, పాలు, గుడ్లు, చిక్కీలతో కూడిన పోషకాహారం గురించి వివరించారు. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, గుడ్లు, పాలు, మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యతో పాటు గుడ్డు, పాలు, వేడి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా పరిశీలించి పోషకాహార లోపం ఉన్న వారిని ‘నవచేతన’ యాప్ ద్వారా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎంవీవై పథకం కింద అర్హులైన తల్లులకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. తల్లులు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా విజయలక్ష్మి, ఏఎన్‌ఎం రజియా తదితరులు పాల్గొన్నారు.



