పులివెందుల, ఆగస్టు 5: జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని కె. వెలమవారిపల్లె, ప్రశాంతినగర్ స్వర్ణ వార్డు పరిధిలోని పాల్‌రెడ్డి రోడ్డు అంగన్వాడి కేంద్రాల్లో బుధవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ బెల్లాల హేమలత మాట్లాడుతూ, శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, శిశువు అవసరాన్ని బట్టి రోజుకు 8 నుంచి 12 సార్లు పాలివ్వాలని సూచించారు.
తల్లిపాల వల్ల శిశువుల్లో రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధి మెరుగుపడటంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయని వివరించారు. అలాగే పాలిచ్చే తల్లులు తగినంత నీరు తాగడంతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, ధాన్యాలు, కోడిగుడ్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. దీంతో తల్లులు త్వరగా కోలుకోవడంతో పాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు కూడా తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.
అనంతరం గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు మాధవి, రామాంజనమ్మ, స్నేహలత, విజయభారతి, వాసంతి, పార్వతమ్మ, నివాస, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు దుస్సా లక్ష్మీదేవి, ప్రశాంతినగర్ ఏఎన్‌ఎం, అంగన్వాడి సహాయకురాళ్లు, ఉపాధ్యాయులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.



