రాయచోటి: తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని రాయచోటి అర్బన్ పోలీసులు సకాలంలో గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. గాలివీడు రోడ్డులోని గంగమ్మ ఆలయం సమీపంలో నివాసముంటున్న జయరాములు తన కుమారుడు లోకేష్‌ను మందలించడంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
అర్బన్ సీఐ వెంకట చలపతి ఆదేశాల మేరకు ఎస్ఐ చండ్రాయుడు సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి బాలుడి కదలికలను గుర్తించి జగనన్న కాలనీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలను కఠినంగా మందలించకుండా వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రేమగా మాట్లాడాలని పోలీసులు సూచించారు.



