ప్రొద్దుటూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరడంతోనే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రజల దృష్టిని డీఎస్సీ అక్రమాల నుంచి మళ్లించేందుకే ఈ సోదాలు చేస్తున్నారని అన్నారు.
డీఎస్సీ నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందని, ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల వరకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైసీపీపై విమర్శలు చేయడం కాకుండా, నియామకాల్లో అక్రమాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని రాచమల్లు పేర్కొన్నారు.



