డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండలానికి చెందిన పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, విద్యార్థి విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.
దీక్షకు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల హామీల ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.



