జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో చేపట్టిన తొలి రోజు దీక్షల్లో మైలవరం మండలానికి చెందిన నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా సహా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



