బద్వేల్, ఆగస్టు 6: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, సమగ్ర సీబీఐ విచారణతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



