ప్రొద్దుటూరు: చేనేత వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించాలని మాజీ బీసీ కౌన్సిలర్లు, వైసీపీ బీసీ నాయకులు కోరారు. గురువారం దొరసానిపల్లెలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పద్మశాలీ, తొగట వీరక్షత్రియ, దేవాంగ తదితర చేనేత వర్గాలు ఐక్యంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఏ పార్టీ చేనేత వర్గానికి చైర్మన్ పదవి కల్పించినా పార్టీలకతీతంగా మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై రాచమల్లును కలిసి కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ భాగస్వాములుగా గుర్తించి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లె లక్ష్మీదేవి, మాజీ కౌన్సిలర్లు, వైసీపీ బీసీ నాయకులు పాల్గొన్నారు.



