ప్రొద్దుటూరు, సెప్టెంబరు 29: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రొద్దుటూరులో 3కే వాక్‌థాన్ నిర్వహించారు. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గాంధీరోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వాక్‌థాన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం, నడకకు కేటాయించడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచించారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దూరంగాన్నారు.
గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణలో నడక, వ్యాయామం ప్రాధాన్యతను తెలియజేయడమే లక్ష్యంగా వాక్‌థాన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వాక్‌థాన్‌ను విజయవంతం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, ఎన్జీవోల అధ్యక్షుడు రామసుబ్బయ్య, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



