మదనపల్లె: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా క్యాబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహమ్మద్ అన్నారు. మదనపల్లె టౌన్ అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత నాలుగు క్యాబినెట్ సమావేశాల్లో రెండు సమావేశాల నుంచి పవన్ మధ్యలో వెళ్లిపోగా, మరో రెండు సమావేశాలకు హాజరు కాలేదన్నారు. అనారోగ్యం కారణమని చెబుతున్నప్పటికీ, డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలే కారణమా అనే అనుమానాలు ఉన్నాయని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి చెల్లించని కూటమి ప్రభుత్వాన్ని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.



