రాయచోటి, ఆగస్టు 19: వడ్డెర సామాజిక వర్గానికి తొలిసారిగా ఎమ్మెల్సీ పదవి దక్కడం సంతోషకరమని ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె. జీవానందం అన్నారు. అనంతపురానికి చెందిన దలవాయి రమాదేవిని ఎమ్మెల్సీగా నియమించడం వడ్డెర సమాజానికి దక్కిన గుర్తింపన్నారు. సాధారణ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన రమాదేవి, రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా పార్టీ కోసం పనిచేశారని తెలిపారు. ఆరు కేసులను ఎదుర్కొంటూ చేసిన పోరాటానికి గుర్తింపుగానే పదవి దక్కిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఏడు దశాబ్దాల తర్వాత వడ్డెరలకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చామని ముఖ్యమంత్రి ప్రకటించడం, ఇన్నాళ్లుగా తమకు సరైన ప్రాతినిధ్యం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఒక్క ఎమ్మెల్సీతో సరిపెట్టకుండా జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్, చైర్‌పర్సన్ పదవుల్లోనూ అవకాశం కల్పించాలని కోరారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.



