ప్రొద్దుటూరు, సెప్టెంబరు 29: సచివాలయ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు. మంగళవారం దొరసానిపల్లెలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులతో మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అమరావతికి వెళ్లే ఉద్యోగులకు అనుమతులు, సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అదనపు విధులతో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, బకాయిలు, పే స్కేలు, అలవెన్సులు, మెటర్నిటీ లీవ్ తదితర సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇంటింటి సర్వే, ఆధార్ కేంద్రాల నిర్వహణ వంటి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైనా దృష్టి సారించాలని సూచించారు. ఉద్యోగులపై నమోదైన కేసులను పునఃపరిశీలించి, అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు వైఎస్సార్సీపీ మద్దతుగా ఉంటుందని తెలిపారు.



