ప్రొద్దుటూరు, ఆగస్టు 9: ఎన్జీవో ప్రొద్దుటూరు తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, అభిలాష్ నేత్ర వైద్యశాల సహకారంతో ఎన్జీవో హోమ్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అలాగే హరిక హాస్పిటల్, మోడంపల్లె ఉర్దూ మున్సిపల్ హైస్కూల్ ఆధ్వర్యంలో జిన్నా రోడ్డు ప్రాంతంలో మరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరాలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తీయార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్తీయార్ మాట్లాడుతూ ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.



