దువ్వూరు, ఆగస్టు 5 మండలంలోని రైతులు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన అన్ని పంటలను తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి సూచించారు. బుధవారం చిన్నసింగనపల్లె గ్రామంలో నిర్వహించిన “పొలం పిలుస్తోంది” కార్యక్రమంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు.
వరి, మొక్కజొన్న, మినుము, ఉల్లి, పసుపుతో పాటు ఇతర పంటలను కూడా ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవడం వల్ల పంట బీమా, ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టపరిహారం, కనీస మద్దతు ధర వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వినియోగంలో పొదుపు పాటించాలని, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకాలపై ప్రభుత్వం 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు.
అలాగే రైతులు ఏపీ యాప్ ద్వారా ఎరువులను పారదర్శకంగా పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సాగు విధానాలపై అవగాహన కల్పించగా, ఉద్యానవన శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



