ఓబులవారిపల్లి: మండలంలోని మంగళంపల్లి, హరిజనవాడ గ్రామాల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామానికి చేరుకున్న సాయి వికాస్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



