ప్రొద్దుటూరును పరిశుభ్రమైన, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘం, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు సందేశం ఇచ్చారు.
అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నుంచి శివాలయం సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం, ప్రజారోగ్యంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, దానికి బదులుగా గుడ్డ సంచులు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రొద్దుటూరును స్వచ్ఛమైన, ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల సహకారంతోనే ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథం, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం ప్రతిజ్ఞ చేశారు.



