అమరావతి: అమరావతిలో అమలులో ఉన్న భూకేటాయింపు నిబంధనల ప్రకారం ప్రైవేట్ అసోసియేషన్లకు భూములు కేటాయించే అవకాశం లేదని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌కు ఐదు ఎకరాల భూమి కేటాయింపు అంశంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు.
స్టేట్ ఆఫీస్, కన్వెన్షన్ సెంటర్ కోసం అసోసియేషన్ సీఆర్డీఏకు దరఖాస్తు చేసినప్పటికీ, నిబంధనలు అనుమతించకపోవడంతో భూమి కేటాయించలేదని తెలిపారు. అమరావతిలో భూముల కేటాయింపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన నిబంధనల ప్రకారమే జరుగుతోందన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల్లో మెజారిటీ ఇప్పటికే చెల్లించామని, మిగిలిన వాటిని కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు.



